అనుపమ పరమేశ్వరన్... తెలుగు సినిమా అభిమానులకు ఇప్పుడు పరిచయం అవసరం లేని పేరు. "అ ఆ" సినిమాలో గయ్యాళిగా కనిపించినా, తెలుగు "ప్రేమమ్" సినిమాతో కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టిందీ కేరళ కుట్టి. ఇప్పుడు శతమానం భవతితో మరో హిట్టు కొట్టి గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. ఈ అమ్మడు ఇప్పుడు ఏకంగా మెగా ఫ్యామిలీ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసి అందరి దృష్టినీ ఆకర్షించింది.
జుట్టు విరబూసుకుని తన కంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్‌ని ఏర్పాటుచేసుకుని టాలీవుడ్ లో చోటు సంపాదించింది అనుపమ. మలయాళ ప్రేమమ్ తెలుగులో తీసేటప్పుడు అందులో ప్రధానపాత్ర పోషించిన పల్లవిని మార్చి - శ్రుతిహాసన్ ను తీసుకున్నారుగానీ, అనుపమను మాత్రం మార్చడానికి ఇష్టపడలేదు దర్శక - నిర్మాతలు. అందుకు ప్రధాన కారణం ఆమె స్టైలే. ప్రేమమ్ పెద్ద హిట్టయింది. నాగచైతన్యకు కొత్త ఊపునిచ్చిందా సినిమా.
ఆ తరవాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన "అ ఆ" సినిమాలో అనుపమలోని నెగెటివ్ కోణాన్ని వాడుకున్నాడు. దీంతో తాను ఎలాంటి పాత్రనయినా చేయగలనని నిరూపించుకుంది అనుపమ. అంతవరకూ తెలుగులో చేసినవి రెండే సినిమాలు... అందులోనూ చిన్న పాత్రలే... అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుపమ అనంతరం లక్కీ చాన్స్ కొట్టేసింది. అదే శతమానం భవతిలో అవకాశం. తాను పూర్తిస్థాయి హీరోయిన్ గా కూడా నటించగలననీ, అందచందాలతో ఆకట్టుకోగలననీ ఆ సినిమాతో నిరూపించుకుంది. సంక్రాంతి బరిలో రెండు భారీ సినిమాలు ఖైదీ నం.150, గౌతమిపుత్ర శాతకర్ణి ఉన్నా శతమానం భవతి కూడా తన ఉనికి చాటుకుంది. అందుకు అనుపమ కూడా ప్రధాన కారణమనీ, ఆమెది గోల్డెన్ లెగ్గేనని అంటున్నారు విశ్లేషకులు.
శతమానం భవతిలో ఆమె నటనను చూసిన దర్శకుడు సుకుమార్ తన తరవాతి సినిమాలో ఆమెనే హీరోయిన్‌గా ఎంచుకున్నాడట. ఇందులో హీరో ఎవరో తెలుసా... మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా అవకాశం వచ్చిన వెంటనే అనుపమ ఓ కఠిన నిర్ణయం తీసుకుందట. అదేంటంటే... ఇక మీదట చిన్నచిన్న క్యారెక్టర్లు చేయకూడదని. చేస్తేగీస్తే హీరోయిన్ గానే చేస్తుందట. అది కూడా ఎప్పుడో తెలుసా... సుకుమార్ - రామ్ చరణ్ సినిమా పూర్తయ్యాకేనట. ఆ సినిమా హిట్టయితే అనుపమ తెలుగులో నంబర్ 1 అయిపోతుందనడంలో సందేహం లేదు. ఒకవేళ హిట్ కాకపోయినా అగ్ర హీరోల సరసన అవకాశాలు వస్తాయి కాబట్టి అనుపమ కూడా అగ్ర హీరోయిన్ అయిపోతుంది. ఆల్ ద బెస్ట్ అనుపమ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/