'ఆచార్య' ఆ డేట్‌ కు ఫిక్స్‌ అయినట్లేనా?

Update: 2021-10-09 08:32 GMT
మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల కాంబోలో తెరకెక్కిన 'ఆచార్య' సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. ఈ ఏడాది ఆరంభంలో విడుదల చేయాలనుకున్న ఆచార్య కు కరోనా సెండ్‌ వేవ్ అడ్డు వచ్చింది. షూటింగ్‌ పూర్తి చేసి విడుదలకు సిద్దం చేసిన ఈ సమయంలో మాత్రం ఇతర సినిమాలు పోటీగా వస్తూ విడుదల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఆచార్య సినిమా ను డిసెంబర్‌ 17న విడుదల చేయాలనే బలమైన నిర్ణయానికి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాని అదే సమయంలో విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాల పరిస్థితి ఏంటీ అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఆచార్యను విడుదల చేస్తే డిసెంబర్‌ 17న విడుదల చేయాలి. లేదంటే వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు వెయిట్ చేయాలి అనేది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ.

డిసెంబర్‌ 17న విడుదల చేయాలనే విషయంలో దర్శకుడు కొరటాల శివ చాలా సీరియస్ గా ఉన్నాడు అంటున్నారు. ఆయన ఖచ్చితంగా సినిమా ఆ తేదీకి విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నా కూడా నిర్మాతలు మరియు ఇతర విషయాలు మాత్రం ఆ తేదీ విడుదలకు కాస్త కష్టం అన్నట్లుగా ఉన్నాయట. చిరంజీవి తల్చుకుంటే ఆ తేదీన అంతా క్లీయర్‌ చేయడం పెద్ద సమస్య కాదని.. ఇప్పటికే ఆలస్యం అయిన ఆచార్యను వెంటనే విడుదల చేయాలని కొరటాల కోరుకుంటున్నాడు. చిరంజీవితో పాటు ఇతర మెగా హీరోలతో ఆచార్య విడుదల విషయంలో కొరటాల శివ చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఆచార్య విడుదల విషయంలో కనుక డిసెంబర్‌ నిర్ణయం తీసుకోకుంటే కొరటాల తదుపరి సినిమా విషయంపై ఆ ప్రభావం పడుతుందని అంటున్నారు.

ఆచార్య సినిమాలో చిరంజీవితో పాటు రామ్‌ చరణ్‌ నటించగా కాజల్‌ తో పాటు పూజా హెగ్డే కూడా హీరోయిన్‌ గా నటించారు. మొత్తానికి ఈ సినిమా అంచనాలు పీక్స్ లో ఉండగా విడుదల విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భారీ వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం ఉన్న ఈ సినిమాను ఖచ్చితంగా ఆలస్యం అయినా పర్వాలేదు కాని మంచి సమయం చూసి విడుదల చేయాల్సి ఉంటుంది. కనుక ఆచార్య విడుదల తేదీ విషయంలో కాస్త ఆచి తూచి వ్యవహరించాలి అనేది మెగా కాంపౌండ్ అభిప్రాయం. నిర్మాతలు కూడా విడుదల విషయంలో మెగా స్టార్‌ నిర్ణయాన్ని గౌరవించాలని భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాదిలోనే విడుదల అవుతాడు. కాస్త అటు ఇటు ఏమైనా అయితే మాత్రం వచ్చే ఏడాది సమ్మర్ వరకు వెయిట్‌ చేయాల్సి రావచ్చు.




Tags:    

Similar News