ప్ర‌స్తుత `మా`లో తెలంగాణ క‌ళాకారుల‌కు అన్యాయం?

Update: 2021-06-29 06:30 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల్లో తెలంగాణ వాదం గెలుస్తుందా?  మా అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో ఉన్న `తెలంగాణ వాది` సీవీఎల్ న‌ర‌సింహారావును తెలంగాణ క‌ళాకారులు గెలిపించుకుంటారా? అంటే.. ఈ ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌నే స‌మాధానం ఇచ్చారు.

ఒక‌వేళ సీక్రెట్ బ్యాలెట్ ప‌ద్ధ‌తిలో ఓటింగ్ నిర్వ‌హిస్తే నేనే త‌ప్ప‌క గెలుస్తాన‌ని ఆయన అన్నారు. ఎన్నిక‌ల‌కు ఇంకా రెండు నెల‌ల స‌మ‌యం ఉంది. ఈలోగానే ఏదైనా మారొచ్చ‌ని అన్నారు. అయితే సీక్రెట్ బ్యాలెట్ పై న‌మ్మ‌క‌మెందుకు? అంటే.. మాలో ఉన్న ఆర్టిస్టులు ఎవ‌రూ త‌న‌కు మ‌ద్ధ‌తిచ్చేందుకు ఓపెన్ గా సిద్ధంగా ఉండ‌ర‌ని అలా చేస్తే వారికి అవ‌కాశాలు ఇవ్వ‌ర‌ని అన్నారు. అందుకే బ‌హిరంగ మ‌ద్ధ‌తునివ్వ‌ర‌ని తెలిపారు.

మా అసోసియేష‌న్ వ‌ల్ల తెలంగాణ క‌ళాకారుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని కూడా అన్నారు. అందుకే స‌ప‌రేట్ గా తెలంగాణ మా అసోసియేష‌న్ ప్రారంభించాల‌ని భావించామ‌ని కానీ కుద‌ర‌లేద‌ని తెలిపారు. మాలో ఉన్న మధ్యతరగతి కళాకారుల ఇబ్బందుల పరిష్కారమే తన లక్ష్యమని తెలంగాణ క‌ళాకారుల‌కు ప్ర‌త్యేక ప్రాతినిధ్యం ఉంటుంద‌ని తెలిపారు.

మాలో ఆర్టిస్టు కం నిర్మాత‌లున్నారు. కానీ తాను కేవ‌లం ఆర్టిస్టును మాత్ర‌మేన‌ని న్యాయ‌వాది కం ఆర్టిస్టు సీవీఎల్ అన్నారు. రెండు సార్లు మా ఎన్నికలలో ఎలక్షన్‌ అధికారిగా ఉన్నాన‌ని.. పదేళ్ల పాటు న్యాయసలహాదారుడిగా కొన‌సాగాన‌ని వెల్ల‌డించారు. మా అవ‌క‌త‌వ‌క‌లు తెలుస‌ని అన్యాయానికి గురైన వారు త‌న‌కు మ‌ద్ధ‌తిస్తార‌ని కూడా అన్నారు. ఈసారి ఏక‌గ్రీవ కార్య‌వ‌ర్గానికి ఆస్కారం ఉంద‌ని అన్నారు. తెలంగాణ క‌ళాకారుల కోసం చేసిన తీర్మానాలేవీ అమ‌లు కావ‌డం లేద‌ని బ‌య‌టి వారికి అవ‌కాశాలిస్తున్నార‌ని కానీ తాను గెలిస్తే ప‌ద్ద‌తి మారుతుంద‌ని ఈవీఎల్ అన్నారు.
Tags:    

Similar News