'బాబు బంగారం .. అంతే': పరశురామ్

Update: 2022-05-07 10:30 GMT
మహేశ్ బాబు తన సినిమాలకి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక సినిమా తరువాత ఒక సినిమాను చేసుకుంటూ వెళుతుంటారు. ఏ సినిమా అయితే చేస్తున్నారో ఆ సినిమాపైనే పూర్తి ఫోకస్ పెడుతుంటారు. అందువలన ఆయన ఆ సమయంలో మరో ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకుని రారు. ఈ  కారణంగానే ఆయన తనకి ముందుగా చెప్పిన సమయానికి తన సినిమా పూర్తి కావాలనే బలమైన నిర్ణయంతో ఆయన ఉంటారు. అలాగే ఆయన దర్శకులను బాగా నమ్ముతారు. హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ పనిచేయడానికి ఉత్సాహం చూపుతుంటారు.

మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన 'సర్కారివారి పాట' ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో పరశురామ్ మాట్లాడుతూ ..  తాను ఇంతవరకూ పని చేస్తూ వచ్చిన హీరోలను గురించి ప్రస్తావించాడు.

నిఖిల్ తో 'యువత' చేశాను. తను నాకు తమ్ముడు లాంటివాడు. రవితేజ విషయానికి వస్తే, ఆయన ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక శిరీష్ అంటే నాకు చాలా ఇష్టం. 'సారొచ్చారు' ఫ్లాప్ తరువాత శిరీష్ నాకు ఛాన్స్ ఇచ్చాడు. నిజంగా తను చాలా నైస్ పర్సన్.

విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పేదేవుంది? తను చాలా డీసెంట్ పర్సన్. మహేశ్ బాబు గురించి  చెప్పేది ఒకటే మాట 'బంగారం'. పాన్ ఇండియా సినిమా కోసమని  నేను ఈ కథను  రాసుకోలేదు .. పాన్ ఇండియా సినిమాను చేయాలనుకోలేదు.

మహేశ్ బాబు కెరియర్లో కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందని మాత్రం చెప్పగలను. ఈ సినిమాలో కీర్తి సురేశ్ పాత్ర చాలా బాగుంటుంది. ఆమె పాత్రను పట్టుకునే ఈ కథ ముందుకు వెళుతుంది. ఈ సినిమాకి ఆమె పాత్ర చాలా ప్లస్ అవుతుంది.

'నేను శైలజ' సినిమా అప్పటి నుంచి కీర్తిని చూస్తూనే ఉన్నాను. ఆమెతో సినిమా చేసే ఛాన్స్ కోసం అప్పటి నుంచే ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాలో కీర్తి సురేశ్ ను ఊహించుకునే నేను ఆ పాత్రను రాసుకున్నాను. హీరోయిన్ ట్రాక్ ను మహేశ్ బాబు వింటూ బాగా ఎంజాయ్ చేశారు. కథ అంతా విన్న తరువాత అడిగారు హీరోయిన్ ఎవరు? అని. కీర్తి సురేశ్ ను అనుకుంటున్నాను సార్ అన్నాను. నైస్ ఛాయిస్ అన్నారాయన. అలాగే మహేశ్ గారిని అనుకునే ఈ కథను రాసుకున్నాను. ఆయన కుదరదంటే ఈ కథను పక్కన పెట్టేసేవాడినంతే" అని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News