'భీమ్లా నాయక్' నాకు పునర్జన్మలాంటిది: సంయుక్త మీనన్

Update: 2022-02-23 16:23 GMT
'వకీల్ సాబ్' తరువాత పవన్ కల్యాణ్ చేసిన మరో రీమేక్ 'భీమ్లా నాయక్'. సితార బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో మరో ప్రధానమైన పాత్రను రానా పోషించాడు. ఈ రెండు పాత్రలు ఢీ అంటే ఢీ అంటూ తలపడుతూ ఉంటాయి. అలా వాళ్లిద్దరిని చూడటానికి అభిమానులు కాచుకుని కూర్చున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా కేటీఆర్ .. గౌరవ అతిథిగా తలసాని శ్రీనివాస యాదవ్ హాజరయ్యారు.

ఈ వేదికపై తమన్ మ్యూజికల్ షోను నడిపించాడు. ఆయా పాటల రచయితలను వేదికపై పిలుస్తూ .. ఆయా పాటలను సింగర్స్ తో పాడిస్తూ .. ఎవరికి ఇవ్వవలసిన క్రెడిట్ వారికి ఇవ్వడం గొప్పగా అనిపించింది. ఇక ఈ కథ అంతా కూడా ట్రైబల్ ఏరియాలో జరుగుతుంది. అందువలన అక్కడి పాటల్లో ఆ యాస వినిపించాలి. పాటల్లో ఆ ప్రాంతానికి చెందిన పరికరాల వాద్యాలు వినిపించాలి. అందుకోసం ఉపయోగించిన వాద్య పరికరాలను .. వాటిని డ్రమ్స్ శివమణి ప్లే చేయడాన్ని ఒక వీడియోగా తమన్ ఆవిష్కరించిన తీరు బాగుంది .. అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

ఇక కేటీఆర్ తో మరో ట్రైలర్ ను లాంచ్ చేయించారు. 'అహంకారానికీ .. ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం' అంటూ పవన్ - రానా పాత్రలకి సంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ రెండు పాత్రలు ఎంత పట్టుదలగా .. ఎంత పవర్ఫుల్ గా ఉంటాయనేది మరోసారి చూపించారు. మొగిలయ్య మాదిరిగానే మరో పాటకి గొంతు కలిపిన దుర్గవ్వను కూడా ఈ వేదికపై శాలువాతో సత్కరించారు. ఆ తరువాత కథానాయిక సంయుక్త మీనన్ మాట్లాడటం మొదలు పెట్టేసరికి ఆమె ఇంగ్లిష్ లో దంచేస్తుందని అంతా అనుకున్నారు. కానీ మాట్లాడినంత వరకూ ఆమె చాలా స్పష్టంగా తెలుగులో మాట్లాడుతూ కట్టిపడేసింది.

ఈ సినిమా టీమ్ లో పవన్ నుంచి ఎవరినీ వదలకుండా మాట్లాడుతూ, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. పవన్ - రాణాలతో కలిసి నటించడం తన అదృష్టమని చెప్పింది. ఈ సినిమా తనకి ఒక పునర్జన్మ అంటూ ఈ అవకాశం రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసింది. "పెద్దగా కలలు కనండి .. కలలను ఆపకండి .. ధైర్యంగా వాటిని ఛేజ్ చేయండి" అంటూ పవన్ కల్యాణ్ సినిమాలో నుంచి ఒక డైలాగ్ చెప్పి అందరినీ హుషారెత్తించింది. ఆమె మాట్లాడే తీరు చూసిన సుమ "అమ్మా యాంకరింగ్ లోకి మాత్రం రాకమ్మా .. తొక్కేసేలా ఉన్నావు" అనడం కొసమెరుపు.       
Tags:    

Similar News