తమన్ ఇంతకాలానికి సంపాదించాడు

Update: 2016-03-25 07:30 GMT
‘బాయ్స్’ సినిమాలో శవం ముందు డప్పు కొట్టుకుంటూ వెళ్లే కుర్రాడిని చూసి ఇతను మంచి కమెడియన్ అవుతాడని అనుకున్నాం కానీ.. సౌత్ లోనే టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకుంటాడని ఎవ్వరూ అనుకోలేదు. చాలా తక్కువ వ్యవధిలో సంగీతం దర్శకుడిగా 50 సినిమాలు పూర్తి చేసుకున్న తమన్.. అందులో చాలానే హిట్లు కొట్టాడు. ఐతే ఇన్ని సినిమాలు చేసినా.. తనకు తన గురువు దగ్గర్నుంచి ప్రశంసలు అందుకోవడానికి చాలా సమయమే పట్టిందని అంటున్నాడు తమన్. ఇంతకీ తమన్ గురువు ఎవరంటారా.. టాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన మణిశర్మే.

మణి దగ్గర తమన్ ఆరేడేళ్ల పాటు డ్రమ్స్ ప్లేయర్ గా పని చేశాడు. ‘ఒక్కడు’ దగ్గర్నుంచి ‘బిల్లా’ వరకు 95 మణిశర్మ సంగీతం అందించిన 95 సినిమాలకు పని చేశాడట తమన్. ఆ సంగతి ఈ రోజే ట్విట్టర్ లో వెల్లడించాడు తమన్. మణి సార్ దగ్గర తాను ఎంత నేర్చుకున్నానో మాటల్లో చెప్పలేనని.. అది తన అదృష్టమని ఎగ్జైట్ అవుతూ.. తన గురువుతో కలిసి ఉన్న ఫొటో షేర్ చేశాడు తమన్. ఐతే తాను అసిస్టెంటుగా పని చేసినపుడు కానీ.. ఆ తర్వాత తాను సంగీత దర్శకుడిగా మారి వరుసగా సినిమాలు చేసినపుడు కానీ.. తనకు మణిశర్మ కాంప్లిమెంట్స్ ఇవ్వలేదని.. చివరికి ‘బ్రూస్ లీ’ మూవీకి ఆయన నుంచి ప్రశంసలు అందుకున్నానని చెప్పాడు తమన్. ‘బ్రూస్ లీ’ ఆడకపోయి ఉండొచ్చు కానీ.. ఆ చిత్రానికి తమన్ అందించిన సంగీతానికి మాత్రం మంచి అప్రిషియేషనే వచ్చింది. గురువు కూడా ప్రశంసించాడంటే ఇక తమన్ కు అది చాలా స్పెషల్ మూవీనే కదా.
Tags:    

Similar News