కుర్చీలాటలో బడ్జెట్ ని మరచిపోయారుగా !

అనకాపల్లి భీమునిపట్నం మునిసిపాలిటీలు చేరడంతో కచ్చితంగా ఈ సంఖ్య నలభై లక్షల దాకా ఉండొచ్చు అన్నది అంచనా.;

Update: 2025-03-22 02:45 GMT

మహా విశాఖ నగరపాలక సంస్థగా అయ్యాక విశాఖ జనాభా పెరిగింది. అనకాపల్లి భీమునిపట్నం మునిసిపాలిటీలు చేరడంతో కచ్చితంగా ఈ సంఖ్య నలభై లక్షల దాకా ఉండొచ్చు అన్నది అంచనా. ఇక జీవీఎంసీ ప్రతీ ఏటా కార్పోరేషన్ లో నివసించే పౌరుల కోసం అభివృద్ధి కోసం బడ్జెట్ ని ప్రవేశపెడుతుంది. అది ఏ ఏటికి ఆ ఏడు అధికమవుతూ వస్తోంది. నాలుగు నుంచి అయిదు వేల కోట్ల వార్షిక బడ్జెట్ ఉంటుంది.

అయితే ఈసారి బడ్జెట్ ని మాత్రం జీవీఎంసీ ఆమోదించలేదు. అసలు బడ్జెట్ ఊసే లేదు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ లేదు. మరో పది రోజుల లోపే మార్చి నెల ముగుస్తోంది. ఆర్ధిక సంవత్సరం అలా ముగిసి కొత్త ఆర్ధిక సంవత్సరం వస్తుంది. జీవీఎంసీ అభివృద్ధికి అలాగే అభివృద్ధికి సంబంధించిన బడ్జెట్ ని ఆమోదించకపోతే ఎలా అన్న చర్చ సాగుతోంది.

వైసీపీ చేతిలో జీవీఎంసీ ఉంది. నాలుగేళ్ళ పాటు వైసీపీ బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. ఒక ఒక్క ఏడాది ఉంది. ఈ బడ్జెట్ ని కూడా వైసీపీయే ప్రవేశ పెట్టాల్సి ఉంది. కానీ మేయర్ ని దించే రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. దాంతో మేయర్ ఈసారి బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయలేదు. ఒక విధంగా చూస్తే జీవీఎంసీలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది.

ఇక మేయర్ ని దించేసి వైసీపీ నుంచి జీవీఎంసీ తీసుకుంటే తాము అధికారం చేపట్టవచ్చు అని కూటమి నేతలు ఆలోచిస్తున్నారు. అపుడు బడ్జెట్ ని తామే ప్రవేశపెట్టాలని వారు భావిస్తున్నారు. ఎందుకంటే ఒకే ఒక బడ్జెట్ ఉంటుంది. ఇంతా చేసి కూటమి గెలిచినా బడ్జెట్ ని ప్రవేశపెట్టే అవకాశం దక్కకపోతే ఎందుకు అన్నది వారి ఆలోచనగా ఉంది.

మరి బడ్జెట్ ని అయితే ఆమోదించడం లేదు. కనీసం నెల రోజుల వరకు అయినా మధ్యంతర బడ్జెట్ ని ఆమోదిస్తే ఆ మీదట కొత్తగా ఎవరు మేయర్ అవుతారో వారు పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టవచ్చు అని అంటున్నారు. అలాంటి అవకాశం ఉందా అలా చేయవచ్చా అన్నది కూడా మరో చర్చగా ఉంది. ఓటాన్ అకౌంట్ అన్నది శాసనసభలు ప్రవేశపెడతాయి. కార్పొరేషన్లలో అది కుదురుతుందా అన్నది చూడాలని అంటున్నారు.

ఇక అవిశ్వాస తీర్మానాలు మార్చిలో పెడితే ఇలాంటివే ఉంటాయని అంటున్నారు. మార్చి చాలా కీలకమైన నెలగా ఉంటుంది. అన్నింటికన్నా ఇంపార్టెంట్ మార్చి. అందువల్ల ఇపుడు కనుక రాజకీయ ఇబ్బందులు వస్తే అసలుకే ఎసరుగా ఉంటుందని అంటున్నారు. లక్షలాది మంది ప్రజానీకం అభివృద్ధి వేల కోట్ల బడ్జెట్ సంగతి ఏమి చేశారో అన్నది అంతా ఆలోచిస్తున్నారు.

అయితే కూటమి పెద్దలు మాత్రం ఒకటి రెండు రోజులలో మేయర్ మీద అవిశ్వాసానికి సిద్ధపడుతున్నారు. జీవీఎంసీకి పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడం వల్ల కలెక్టర్ ని కలసి అవిశ్వాస తీర్మానం ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇక అవిశ్వాసం కూటమి పెడితే ఎలా కాచుకోవాలో అన్న ఎత్తుగడలలో వైసీపీ ఉంది. దాంతో బడ్జెట్ అన్నది ఇపుడు ఎవరూ ఆలోచించడం లేదా అన్నది చర్చకు వస్తోంది.

బడ్జెట్ సెషన్ మీటింగ్ పెట్టాలీ అంటే ఏడు రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. గడువు చూస్తే ఒకటి రెండు రోజులే ఉంది. దాంతో ఏమి చేస్తారు అన్నదే చర్చగా ఉంది. ఈ రాజకీయ కుర్చీలాటలో బడ్జెట్ ని మరచారా అని అంతా అనుకుంటున్న నేపధ్యం ఉంది.

Tags:    

Similar News