20 కుక్కల్ని కాల్చి చంపిన ఎపిసోడ్ మిస్టరీ వీడింది.. ఏం జరిగిందంటే?

వారిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులకు విస్మయానికి గురి చేసే అంశాలు బయటకు వచ్చాయి.

Update: 2024-03-20 04:19 GMT

కొద్ది కాలం క్రితం ఒక అమానవీయ సంఘటన చోటు చేసుకోవటం.. అది కాస్తా వార్తగా వచ్చినప్పటికి ఆ దుర్మార్గానికి పాల్పడిన వారెవరన్న విషయాన్ని పోలీసులు గుర్తించలేదు. దీంతో అదో మిస్టరీగా ఉండిపోయింది. తాజాగా ఆ దుర్మార్గాన్ని ఛేదించారు. కొన్ని నెలల క్రితం అర్థరాత్రి వేళలో ఒక గ్రామంలో 20కు పైగా వీధి కుక్కల్ని గన్ తో కాల్చి చంపేసిన వైనం పెను సంచలనంగా మారింది. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అన్నది బయటకు రాలేదు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నాకల్ గ్రామంలో జరిగిన ఈ ఉదంతంలో తాజాగా ముగ్గురిని అరెస్టు చేశారు.

వారిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులకు విస్మయానికి గురి చేసే అంశాలు బయటకు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలంలోని దేవునిపల్లికి చెందిన 57 ఏళ్ల నర్సింహారెడ్డి హైదరాబాద్ లోని రెడ్ హిల్స్ లో ఉంటారు. అతడికి ఫలక్ నుమాకు చెందిన 42 ఏళ్ల తారీఖ్ అహ్మద్.. 40 ఏళ్ల మహ్మద్ తాహెర్ లు మంచి స్నేహితులు. వయసులో అంతరం ఉన్నప్పటికీ వారి మధ్య స్నేహం నడిచేది. నర్సింహారెడ్డి అత్తగారి ఊరు అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామం.

అతడి అత్తగారింట్లో డాక్స్ హుండ్ జాతికి చెందిన పెంపుడు కుక్కలు ఉన్నాయి. అందులో ఒకదాన్ని ఊళ్లోని వీధి కుక్కలు కరిచి చంపేయగా.. మరోదాన్ని గాయపరిచాయి. దీంతో.. వీధి కుక్కల మీద కోపాన్ని పెంచుకున్న నర్సింహారెడ్డి.. తన ఇద్దరు స్నేహితులతో కలసి పొన్నకల్ గ్రామానికి వచ్చాడు. ఫిబ్రవరి 15 అర్థరాత్రి వేళ బెంజ్ కారులో వచ్చిన అతను.. పిస్టల్ తో కనిపించిన ప్రతి వీధి కుక్కను చంపేసి వెళ్లిపోయారు.

అర్థరాత్రి వేళ ఊళ్లో పెద్ద ఎత్తున గన్ పేల్చిన శబ్దాలు రావటంతో భయంతో ఎవరూ బయటకు రాలేదు. దీంతో.. ఈ దారుణానికి పాల్పడిన వారెవరు? అన్నది తేల్లేదు. అయితే.. వచ్చిన కారు మాత్రం బెంజ్ గా గుర్తించారు. ఈ ఉదంతం అప్పట్లో సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా.. తాజాగా పొన్నకల్ లో దావత్ చేసుకునేందుకు ఈ ముగ్గురు మళ్లీ అదే కారులో వచ్చారు. పక్కా సమాచారంతో భూత్పూరు సీఐ రామక్రిష్ణ అడ్డాకుల ఎస్ఐతో కలిసి ఈముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తాము చేసిన దుర్మార్గాన్ని వెల్లడించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Tags:    

Similar News