మమతా కులకర్ణీ ఈస్ బ్యాక్.. హోదా కంటిన్యూ!

అవును.. కిన్నార్ అఖడాలో మహా మండలేశ్వర్ హోదాకు తాను చేసిన రాజీనామా తిరస్కరణకు గురైనట్లు మమతా కులకర్ణి వెల్లడించారు.

Update: 2025-02-14 21:30 GMT

ఈసారి జరుగుతోన్న మహా కుంభమేళాలో పలు విషయాలు వైరల్ అవ్వగా.. అందులో బాలీవుడ్ నటి మమతా కులకర్ణి వ్యవహారం ఒకటి! జనవరి 24న ప్రాపంచిక జీవనాన్ని పరిత్యజించి, సన్యాసిగా మారిన ఆమెకు.. ప్రయాగ్ రాజ్ కుంభమేళాలోని కిన్నార్ అఖాడాలో "మాయీ మమతానంద్ గిరి"గా నామకరణం చేశారు.

ఇలా.. అఖాడాలో కులకర్ణి చేరిక తర్వాత అందులోని సభ్యుల మధ్య వివాదాలు తెరపైకి వచ్చాయనే వార్తలొచ్చాయి. ఇందులో భాగంగా.. చేరిన మొదట్లోనే ఆమె అత్యున్నత స్థానమైన మహామండలేశ్వర్ హోదాను పొందడాన్ని పలువురు వ్యతిరేకించారు. దీంతో.. ఆమెపై బహిష్కరణ వేటు పడినట్లు.. దీంతో ఆమె తీసుకున్న దీక్షను రద్దు చేసినట్లు వార్తలొచ్చాయి.

ఈ క్రమంలో ఆమె ఫిబ్రవరి 10న ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా.. కిన్నార్ అఖాడాలో మహా మండలేశ్వర్ హోదాకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె మరో వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామా తిరస్కరణకు గురైనట్లు వెల్లడించారు.

అవును.. కిన్నార్ అఖడాలో మహా మండలేశ్వర్ హోదాకు తాను చేసిన రాజీనామా తిరస్కరణకు గురైనట్లు మమతా కులకర్ణి వెల్లడించారు. ఈ సందర్భంగా.. ఆచార్య లక్ష్మీనారాయణ్ త్రిపాఠీ తనను ఆ హోదాలోనే ఉంచారని చెబుతూ అందుకు కృతజ్ఞరాలినని తెలిపారు. మరోవైపు ఆమె ఆ హోదాలోనే కొనసాగుతారని ఆచార్య లక్ష్మీనారాయణ్ తెలిపారు.

కాగా... 90వ దశకంలో బాలీవుడ్ లో మంచి నటిగా పేరు సంపాదించుకొన్న మమతా కులకర్ణి.. 2003 తర్వాత సినిమాల నుంచి వైదొలిగారు.. అనంతరం విదేశాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆ మధ్య డ్రగ్స్ రాకెట్ లో ఆమె పేరు వినిపించింది.. ఆ సమయంలో పోలీసులు సైతం నోటీసులు పంపినట్లు వార్తలొచ్చాయి.

కట్ చేస్తే... ఇంతకాలం తర్వాత ఆమె కుంభమేళాలో ప్రత్యక్షమయ్యారు. ఇదే సమయంలో అఖాడాలో చేరుతున్నట్లు తెలియడంతో అందరినీ ఆశ్చర్యపరిచారు! ఈ క్రమంలో ఆమె నియామకంపై వివాదం చెలరేగగా.. తాజాగా అది ముగిసినట్లు తెలుస్తోంది!

Tags:    

Similar News