బీజేపీ పక్కా వ్యూహం...నెగ్గిన వక్ఫ్ సవరణ బిల్లు
భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని ఉభయ సభలలో ఆమోదించుకుంది.
భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని ఉభయ సభలలో ఆమోదించుకుంది. దాంతో వక్ఫ్ బోర్డు సవరణలు ఇక మీదట అమలులోకి రానున్నాయి. ఇక రెండు సభలలో దీని మీద విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని నివేదికకు ఆమోద ముద్ర పడింది. గతంలో వక్ఫ్ బోర్డు సవరణల విషయంలో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ జాయింట్ యాక్షన్ కమిటీ నివేదికను జనవరి 29న పార్లమెంట్ కి అందచేసింది.
ఇక పార్లమెంట్ తొలిదశ బడ్జెట్ సమావేశాలకు చివరి రోజు అయిన ఫిబ్రవరి 13న లోక్ సభ, రాజ్యసభలలో ఈ నివేదికను ఆమోదించారు. ఈ సందర్భంగా విపక్షాలు నినాదాలు చేసి సభలో నిరసనలు తెలిపారు. తాము కొన్ని అభ్యంతరాలను బిల్లు విషయంలో తెలిపామని అలా తాము సూచించిన సవరణలను బిల్లులో లేకుండా చేసి నివేదికను ఆమోదించరాదని వారు పట్టుబట్టారు. అయితే విపక్షాల అభ్యంతరాలు ఎలా ఉన్నా పెద్దల సభలో వక్ఫ్ బోర్డు సవరణల బిల్లు నివేదిక అమోదం పొందింది.
ఇక ఈ బిల్లులో 14 సవరణలను బీజేపీ చేసింది. వాటిని యధాతధంగా నివేదికలో ఉంచారు. అదే సమయంలో కాంగ్రెస్ డీఎంకే టీఎంసీ, ఆప్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఎం ఐ ఎం వంటి పార్టీలు సూచించిన సవరణలను మార్పులను కమిటీ తిరస్కరించింది అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇక వక్ఫ్ బోర్డు బిల్లుకు చేసిన కొత్త సవరణల ప్రకారం ఇక మీదట వక్ఫ్ బోర్డులలో ముస్లింలతో పాటుగా ముస్లిమేతరులు కూడా సభ్యులుగా ఉంటారు. ఈ బిల్లుని ముస్లిం వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఉభయ సభలు మాత్రం ఆమోదించాయి. దీంతో రానున్న రోజులలో వక్ఫ్ బోర్డులలో గణనీయమైన మార్పులు రానున్నాయి అని అంటున్నారు.
ఇదిలా ఉంటే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు నివేదిక ఆమోదం ద్వారా బీజేపీ తన పంతం నెగ్గించుకుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు వక్ఫ్ బోర్డు అయిందని, రానున్న రోజులలో గురుద్వార, చర్చిలు, ఆలయాల ఆస్తులను సైతం లక్ష్యంగా చేసుకుంటారని ఆందోళన వ్యక్తం చేసింది. ఏది ఏమైనా బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వక్ఫ్ బిల్లు సవరణలకు ఆమోదం తెచ్చుకుందని అంటున్నారు. మరి దీని అమలు ప్రభావం దాని వల్ల ఏర్పడే పర్యవసానాలు అన్నీ కూడా ఏమిటి అన్నది రానున్న రోజులలో తేలనుంది.