అక్కడ ఉండేందుకు జగన్ ఇష్టపడడం లేదా ?

అయితే జగన్ ఇస్తున్న ప్రకటనలు ఒక ఎత్తు అయితే ఆయన తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఉండేది తక్కువగా ఉంటోంది అని అంటున్నారు.

Update: 2025-02-14 20:30 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ అధికార దర్జా ఒక లెవెల్ లో కనిపించేది. నిత్యం వచ్చే వారితో పోయేవారితో హడావుడిగా ఉండేది. పైగా ప్రభుత్వ పాలన కూడా అక్కడ నుంచే నడిచేది. మరో వైపు పార్టీ కేంద్ర కార్యాలయం కూడా అక్కడే ఉంది. ఇలా చూస్తే కనుక 2019 ఎన్నికల ముందే కట్టిన తాడేపల్లి భవనం రాజ భోగాలనే అనుభవించింది అని చెప్పాలి.

అయితే అది ఒక దశ మాత్రమే 2024లో పార్టీ దారుణ ఓటమి పాలు అయ్యాక వైఎస్ జగన్ కేరాఫ్ బెంగళూరు అయ్యారు. ఆయన ఎంతసేపూ బెంగళూరులో ఎహలెంక ప్యాలెస్ లోనే ఎక్కువ కాలం గడపడానికి ఇష్టపడుతున్నారు అని అంటున్నారు. దాంతో తాడేపల్లి ప్యాలెస్ చూస్తే వెలవెలబోతోంది. ఇక చూసుకుంటే జగన్ ఈ వారంలోనే ఏకంగా రెండు సార్లు బెంగళూరు వెళ్ళారు అంటే ఆయన తాడేపల్లిలో ఉండేదుకు పెద్దగా ఇష్టపడడం లేదా అన్న చర్చ వస్తోంది.

జగన్ ఫిబ్రవరిలో లండన్ నుంచి వచ్చారు. అయితే ఆయన బెంగళూరులోనే ల్యాండ్ అయి ఆ మీదట తాడేపల్లి వచ్చారు. ఆయన పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఇక మీదట జగన్ 2.0ని చూస్తారు అని కూడా గంభీర ప్రకటనలు చేశారు. పార్టీ క్యాడర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

అయితే జగన్ ఇస్తున్న ప్రకటనలు ఒక ఎత్తు అయితే ఆయన తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఉండేది తక్కువగా ఉంటోంది అని అంటున్నారు. జగన్ ఏపీకి అతిధిగా వస్తున్నారు అని కూటమి నేతలు ఒక వైపు విమర్శలు చేస్తున్నరు. మరో వైపు చూస్తే వైసీపీ నేతలను టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు అని అంటున్నారు.

వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. దాని మీద వైసీపీ నేతలు ఇది అక్రమం అని రియాక్టు అయ్యారు. అయితే పార్టీ పరంగా మోరల్ సపోర్టు ఎంత వరకూ లభించింది అన్న చర్చ కూడా ఉంది. వంశీ సతీమణి మీడియా ముందుకు వచ్చి తాము న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ఒక విధంగా చూస్తే చాలా మంది వైసీపీ నేతలు ఇపుడు అరెస్టుల జాబితాలో ఉన్నారని ప్రచారం సాగుతోంది.

ఇంకో వైపు ఆళ్ళ నాని వంటి వైఎస్సార్ వీర విధేయులు టీడీపీలో చేరిపోతున్నారు. మరింత మంది ఆ వైపుగా క్యూ కడుతున్నారని అంటున్నారు. ఇలా సీరియస్ గానే అంతా సాగుతోంది. వైసీపీని అన్ని వైపుల నుంచి టార్గెట్ చేస్తున్న ఈ సమయంలో జగన్ తాడేపల్లిలోనే ఉంటూ పార్టీకి ఒక నిబ్బరం కలిగించాల్సి ఉందని అంటున్నారు.

అయితే జగన్ లండన్ టూర్ తరువాత భారీ మార్పులు వస్తాయని వైసీపీ పోరాటం తీరు మారుతుందని అంతా ప్రచారం చేశారు. కానీ పార్టీ నియామకాలు అయితే చేస్తున్నారు. అలాగే ధైర్యం నేతలకు చెబుతూ ప్రసంగాలు చేస్తున్నారు కానీ బయట వైసీపీ నేతల పరిస్థితి అయితే అలా లేదనే అంటున్నారు. వారు వరస కేసులతో హడలిపోతున్నారు.

ఇక వైసీపీ అధినేత జిల్లాల టూర్ విషయంలో ఒక క్లారిటీ వస్తుందని అనుకున్నా అది ఇప్పట్లో ఉండేలా లేదని అంటున్నారు. ఉగాది తరువాతనే అంటున్నారు. అంటే ఏప్రిల్ నెల నుంచి అని చెబుతున్నారు. అదే విధంగా ఈ నెల చివరి వారం నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ వెళ్తుందా లేదా అన్నది నిర్ణయించలేదని అంటున్నారు. జగన్ అధినేతగా వెళ్ళకున్నా ఎమ్మెల్యేలను అయినా పంపిస్తారు అని అంటున్నారు. మరి ఆ దిశగా ఏమి నిర్ణయించారో చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News