ఇండియాకు మైనార్టీల కంటే ఎలుక‌ల‌తోనే ప్ర‌మాదం

Update: 2019-09-25 12:37 GMT
అఖిల భారత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత - హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ వ‌రుస‌గా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజులుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్‌ గా చేసుకుని వ్యాఖ్య‌లు చేస్తోన్న అస‌ద్ తాజాగా దేశానికి మైనార్టీల నుంచి కంటే ఎలుక‌ల‌తోనే ఎక్కువ ప్ర‌మాదం అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే జార్ఖండ్  అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న రెండు రోజులుగా అక్క‌డ ప‌ర్య‌టిస్తున్నారు.

ఎంఐఎం ఇటీవ‌ల ఇత‌ర రాష్ట్రాల‌కు కూడా విస్త‌రించే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర నుంచి అసెంబ్లీకి - లోక్‌ స‌భ‌కు కూడా ఆ పార్టీ ప్రాధినిత్యం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ యేడాది లోక్‌ స‌భ ఎన్నిక‌ల్లో ఔరాంగాబాద్ ఎంపీ సీటును సైతం ఎంఐఎం గెలుచుకుంది. ఈ క్ర‌మంలోనే జార్ఖండ్‌ లో సైతం మైనార్టీలు ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో త‌మ పార్టీ పోటీ చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలోనే జార్ఖండ్ ముఖ్య‌మంత్రి ర‌ఘువ‌ర్ దాస్ ఇటీవ‌ల కొన్ని వర్గాలు - కొంతమంది వల్ల దేశ భద్రత - సమగ్రతకు ముప్పు వాటిల్లుతోందన్న వ్యాఖ్య‌ల‌పై అస‌ద్ మండిప‌డ్డారు.

జార్ఖండ్‌ లోని కొత్త‌గా నిర్మించిన కోనార్ రిజ‌ర్వాయ‌ర్ కాల్వ గ‌ట్టు తెగ‌డానికి ఎలుక‌లు కార‌ణం అన్న విష‌యం అప్పుడు మ‌ర్చిపోయారా ? అంటూ అస‌ద్ ఎద్దేవా చేశారు. మైనారిటీల కంటే ఎలుకల వల్లే ఈ ప్రమాదం ఉందని - ఈ విషయం కోనార్ రిజర్వాయర్ రుజువు చేసిందని ఒవైసీ చెప్పారు. జార్ఖండ్‌ లోనూ పోటీ చేసి స‌త్తా చాటాల‌ని భావిస్తోన్న అస‌ద్ రాజ‌ధాని రాంచీలో జ‌రిగిన బహిరంగ స‌భ‌లో ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఈ స‌భ‌లో ప‌దే ప‌దే బీజేపీని టార్గెట్‌గా చేసుకున్న అస‌ద్‌.. కోనార్ రిజ‌ర్వాయ‌ర్ కాల‌వ‌ను ప్రారంభించిన 12 గంట‌ల్లోనే అది ధ్వంస‌మైంద‌ని... దీనిని ప్ర‌ధాన కార‌ణం ఎలుక‌లే అన్న విష‌యం ఇంజ‌నీర్లు సైతం చెప్పార‌ని అస‌ద్ తెలిపారు. భారతగడ్డ మీదే జన్మించిన జార్ఖండ్ ముస్లింలను బీజేపీ నేతలు బంగ్లాదేశీయులు అని పేరు పెడుతున్నారంటూ అస‌ద్ విమ‌ర్శించారు. అదే బీజేపీ నాయ‌కులు బంగ్లాదేశ్‌ కు విద్యుత్ అమ్ముకోవ‌డం లేదా ? ఖ‌జానా నింపుకోవ‌డం లేదా ? అని కూడా ప్ర‌శ్నించారు. ఇక జార్ఖండ్‌ లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని అస‌ద్ జోస్యం చెప్పారు.



Tags:    

Similar News