ఓటేసి బయటకొచ్చి భలే మాట చెప్పిన ఐశ్వర్య

Update: 2023-05-10 17:19 GMT
ఐశ్వర్య ఎవరు? ఆమె ఓటేసి బయటకు వచ్చి చెప్పిన మాట వార్తగా ఎందుకు మారుతుంది? అంటే.. ఐశ్వర్య అల్లాటప్పా లేడీ కాదు మరి. ఓటేసి వచ్చిన తర్వాత ఆమె బయటకు వచ్చి చెప్పిన మాట మామూలుది కాదు. అందుకే ఆమె నోటి నుంచి వచ్చిన మాటకు అంత ప్రాధాన్యమని చెప్పాలి. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు.. రానున్న రోజుల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్న నేత డీకే శివకుమార్. ఆయన కుమార్తె ఐశ్వర్య.

బీజేపీ ఏలుబడిలో కాంగ్రెస్ పార్టీ పడిన కష్టాల కంటే కూడా అధికంగా కష్టాల్ని.. ఇబ్బందుల్ని ఎదుర్కొన్నది మాత్రం డీకే శివకుమార్. కోట్లకు పడగలెత్తిన ఆయన విపక్షంలో ఉన్నన్ని రోజులు ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. తాజాగా జరుగుతున్న ఎన్నికలతో ఆయనకు సమస్యల పీడ నుంచి బయటకు వచ్చేసి.. ఆయనే అధికార కేంద్రంగా మారతారన్న మాట వినిపిస్తోంది. అదెంత వరకు నిజం అవుతుందన్నది మరికొద్ది రోజుల్లో విడుదలయ్యే ఎన్నికల ఫలితాలతో స్పష్టమవుతుందని చెప్పాలి.

తాజాగా శివకుమార్ కుమార్తె ఐశ్వర్య ఓటు వేయటం కోసం తన స్వగ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి పోటో దిగారు. 'నా రాష్ట్రం నుంచి ద్వేషాన్ని పారద్రోలి.. మరోసారి శాంతికి ఉద్యానవనంగా మార్చేందుకు నా స్వగ్రామం మంచనహళ్లికి వెళ్లి ఓటు వేశా'' అంటూ ఆమె ఫోటోతో సహా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవో తెలిసిందే. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో సామాన్యులు.. సెలబ్రిటీలు.. ప్రముఖులు అందరూ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తాము ఓటు వేసిన తర్వాత సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

బెంగళూరులో ఓటేసిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎటు చూసినా పోలీసులు.. కేంద్ర బలగాలు కనిపిస్తున్నాయి దీని అర్థం ఏమిటి? భయపెట్టి ఓటు వేయించాలని అనుకుంటున్నారా? అసలు ఇలా ఉంటే ఓటర్లు బయటకు వస్తారా? అని ప్రశ్నించారు. అనంతరం ఆయన ట్వీట్ చేశారు. ''మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కర్ణాటక ఉజ్వలంగా ఉండాలి'' అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన ఓటు వేసిన విషయాన్ని వెల్లడించారు. కన్నడ నటి అమూల్య తన భర్తతో కలిసి బెంగళూరు ఆర్ఆర్ నగర్ లో ఓటు వేశారు.

బెంగళూరు దక్షిణ ఎంపీ.. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య తన తల్లిదండ్రులతో కలిసి ఓటేసి బయటకు వచ్చి.. ట్విటర్ లో ఆ ఫోటోను ట్వీట్ చేశారు. 'అమ్మానాన్నలతో ఓటేశా. .మరి.. మీరు ఎవరితో వెళ్లి ఓటేశారు? ఓటు వేసిన ఫోటోలను షేర్ చేస్తూ రిప్లై ఇవ్వండి' అని కోరారు. దీనికి పెద్ద ఎత్తున నెటిజన్లు రియాక్టు అవుతున్నారు. తాను ఒక సెలబ్రిటీగా ఓటు వేయటానికి రాలేదని.. ఒక భారతీయ పౌరుడిగా మాత్రమే వచ్చినట్లుగా సినీ హీరో కిచ్చా సుదీప్ పేర్కొన్నారు. ఓటు వేయటం తన బాధ్యతగా ఆయన పేర్కొన్నారు.

కర్ణాటక వ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ లో 5.31 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవాల్సి ఉంది. వీరిలో పురుషులు 2.67 కోట్లు అయితే.. మహిళలు 2.64 కోట్లు. ఇతరులు 4,927 మంది. కర్ణాటక వ్యాప్తంగా 58,545 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. సుమారు 4 లక్షల మంది సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. 1.56 లక్షల మంది పోలీసుల్ని బందోబస్తులో పాల్గొంటున్నారు. కర్నాటక చరిత్రలో ఇంత మంది పోలీసుల్ని భద్రత కోసం కేటాయించటం ఇదే తొలిసారి.

దీంతో.. ఎటు చూసినా పోలీసుల వాహనాలే కనిపిస్తుండటంతో ఓటర్లు ఓటు వేసేందుకు బయటకు రావటం లేదన్న మాట వినిపిస్తోంది. ఈ వాదనకు తగ్గట్లే పరిణామాలు ఉండటం గమనార్హం. భారీ అంచనాల మధ్య మొదలైన ఎన్నికల ఓటింగ్ మందగొడిగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 37.25 శాతంగా నమోదైతే.. నాలుగు గంటల సమయానికి యాబై శాతం దాటినట్లుగా చెబుతున్నారు.

Similar News