ఎలాన్ ప్రపంచ కుబేరుల్లో పైల్వాన్

Update: 2020-11-25 13:30 GMT
ఎలాన్‌ మస్క్‌ సంపదలో దూసుకుపోతున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ను అధిగమించారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం సుమారు 128 బిలియన్‌ డాలర్ల సంపదతో రెండో స్థానంలో నిలిచారు. సోమవారం టెస్లా షేరు ధర ఎగియడంతో ఒకే రోజున ఆయన నికర విలువ 7.2 బిలియన్‌ డాలర్లు పెరిగింది.

ఈ సంవత్సరం ఎలాన్ సంపద 100.3 బిలియన్‌ డాలర్ల మేర పేరిగింది. దీంతో 35వ స్థానంలో ఉన్న ఎలాన్ ప్రస్తుతం రెండో స్థానానికి దూసుకొచ్చారు. టెస్లా మార్కెట్‌ విలువ దాదాపు 500 బిలియన్‌ డాలర్ల దరిదాపుల్లో ఉంది. మస్క్‌ సంపదలో సింహభాగం టెస్లాలో ఆయనకున్న షేర్ల ద్వారా వచ్చినదే. టెస్లాతో పాటు స్పేస్‌ఎక్స్‌ పేరిట అంతరిక్ష ప్రయోగాల సంస్థ కూడా మస్క్‌కి ఉంది. కంపెనీల షేర్ల ధరల రోజువారీ మార్పుల ప్రకారం వాటి అధినేతల సంపదను లెక్కించడం ద్వారా బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ర్యాంకులు ఇస్తుంది. ఈ ఏడాది కరోనా మహమ్మారి ప్రతికూల ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉన్నప్పటికీ.. సంపన్నుల సంపద మాత్రం భారీగానే పెరిగింది. సంవత్సరం ప్రారంభమైనప్పట్నుంచీ చూస్తే బ్లూమ్‌బర్గ్‌ సూచీలోని సభ్యుల సంపద విలువ 23 శాతం (సుమారు 1.3 ట్రిలియన్‌ డాలర్లు) ఎగిసింది.

ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు, ఈ సూచీ ప్రారంభించిన ఎనిమిదేళ్లలో గేట్స్‌ రెండో స్థానానికన్నా కిందకి పడిపోవడం ఇది రెండోసారి. 2017లో అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ అగ్రస్థానాన్ని దక్కించుకునే దాకా ఆయనే టాప్‌లో కొనసాగారు. సూచీ తాజా గణాంకాల ప్రకారం గేట్స్‌ సంపద విలువ సుమారు 127.7 బిలి యన్‌ డాలర్లు. సేవా కార్యకలాపాలకు విరాళాలు గానీ ఇవ్వకుండా ఉండి ఉంటే ఇది మరింత ఎక్కువే ఉండేదని పరిశ్రమవర్గాలు తెలిపాయి.

త్వరలోనే మస్క్‌.. అమెజాన్‌ అధినేతను దాటేస్తాడని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. మస్క్‌ స్పేస్‌ ఎక్స్‌లో కొత్త ఆవిష్కరణలు చేపడితే.. అతడి సంపద ఇంకా పెరుగుతుంది.

మరోవైపు టెస్లాతో డ్రైవర్‌లెస్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లను ప్రవేశపెట్టి సంచలనం సృష్టించాడు. త్వరలోనే మనుషులను మార్స్‌ మీదకు పంపుతానని చెబుతున్న మస్క్‌.. అన్నంతపని చేస్తే మాత్రం అతడి సంపద ఇంకా పెరిగే అవశాశం ఉంది.
Tags:    

Similar News