వంట గ్యాస్ ధర భగ్గుమంది. పొయ్యి కింద నీలంగా రావాల్సిన మంట ఎర్రగా చూస్తోంది. చురకలు పెడుతోంది. పొయ్యి మీద వండేందుకు కావాల్సిన సరకుల ధరలు ఎటూ కొండెక్కి ఏమి తినాలి సామీ అనేలా చేస్తున్నాయి. కాస్తా చారు కాచుకుందామన్నా ఇపుడు వంట గ్యాస్ భారంగా మారి వద్దంటోంది. దీని మీద ఎన్నో రకాలైన విమర్శలు వచ్చి పడుతున్నాయి.
ఎందుకిలా వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతున్నారు. గృహ వినియోగదారులకు అదే పనిగా ఎందుకు షాక్ ఇస్తున్నారు అని అంతా గుర్రుమీద ఉన్నారు. విపక్షాలు అయితే ఇది మోడీ సార్ జనాలకు ఇచ్చిన కానుక అని సెటైర్లు వేస్తున్నారు. మరో వైపు చూస్తే ఇలా భారీగా పెంచేసి రెండు వేల రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ ధరను తీసుకుపోరు కదా అని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.
అయితే మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ మాత్రం పాలకులు ఎందుకు సడెన్ గా పొయ్యి కింద మంట పెడుతున్నారు అన్న దాని మీద సీక్రట్ ఏంటో చెప్పేశారు. ఇంటి గ్యాస్ ధర పెంచేసి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను అదే టైమ్ లో తగ్గించడం వెనక భలే ఎత్తుగడ ఉందని ప్రోఫెసర్ గారు అంటున్నారు. అదేంటి అంటే ఇంట్లో వంట వద్దు, అంతా కలసి హొటల్ కి వెళ్ళి అక్కడే విందారగించండి అన్న సూపర్ సందేశం ఉందని అంటున్నారు.
ప్రొఫెసర్ చెప్పినది విశ్లేషిస్తే నిజమే అనిపించకమానదు. ఇంట్లో వంట అంటే పొయ్యి కిందనే కాదు మీద కూడా అవసరమైనవి అన్నీ చూసుకోవాలి. ఇలా ప్రతీదీ ధర పెరిగిన నేపధ్యంలో ఇంట వంట ఖర్చు తడిసి మోపెడవుతోంది. దాంతో ఏ ఫికర్ లేకుండా హొటల్ భోజనం మఠం నిద్రకు జనాలు అలవాటు పడితే ఎటూ హొటళ్ళు కళకళలాడతాయి. అలాగే ఏలిన వారికి జీఎస్టీ రూపంలో బాగానే ఆదాయం సమకూరుతుంది. ఉభయ తారకంగా ఇది బాగుంటుంది అనే వంట గ్యాస్ కి మంట పుట్టించారు అంటున్నారు.
ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పినది చూస్తే ఏడాది కాలంలో ఏకంగా రెండు వందల రూపాయలు వంట గ్యాస్ సిలిండర్ మీద పెంచేశారు. అదే సమయంలో వాణిజ్య సిలిండర్ మీద రెండు వందల రూపాయలు తగ్గించారు. మరి ఇంతకీ ఏలిన ప్రభువులు ఎవరికి ఫ్యాన్స్ అంటే అర్ధమైపోవడంలా.
అందుకే చలో ఛలో హొటల్ కి అన్న పాటను అందుకోవాల్సిందే. ఎక్కడికక్కడ కిచెన్ తలుపులు మూసేసి పొయ్యిలో పిల్లిని లేవకుండా పడుకోబెట్టాల్సిందే. ఇదే మోడీ సార్ అలుపెరగకుండా ఆయాసపడకుండా సాదర జనాలకు ఆహారం నోటికి అందే మార్గమేంటో తెలియచేశారు అని అనుకోవాలి. వీలైతే తెగ సంతోషించాలి, పదిమందికీ ధర పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ చేసిన మంచిని చాటి చెప్పాలి కూడా.