విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణ అయిపోతోందా ?

Update: 2021-12-05 06:30 GMT
విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ తప్పేట్లు లేదు. హోల్ మొత్తం మీద ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయటానికి బదులు ఒక్కో విభాగాన్ని విడదీసీ ప్రైవేటీకరించాలని యాజమాన్యం డిసైడ్ చేసింది. ఇందులో భాగంగానే ఫ్యాక్టరీలో ఎంతో కీలకమైన కోక్ ఓవెన్ విభాగాన్ని ప్రైవేటీకరించేందుకు యాజమాన్యం రెడీ అయిపోయింది. కోక్ ఓవెన్ అంటే ఫ్యాక్టరీ మొత్తానికి అవసరమైన గ్యాస్ ను సరఫరా చేసే కీలకమైన విభాగమిదే. కోక్ ఓవెన్ లో తయారయ్యే గ్యాస్ ను స్టీల్ మెల్టింగ్ షాప్, మిల్స్, బ్లాక్ ఫర్నేసుల్లో ఇంధనంగా వాడుతారు.

దీన్ని బట్టే కోక్ ఓవెన్ విభాగం ఫ్యాక్టరీకి ఎంతటి కీలకమో అర్ధమవుతోంది. ఇలాంటి ఫ్యాక్టరీలో గ్యాస్ ఉత్పత్తి చేసే కోక్ ఓవెన్ విభాగంలో మొత్తం 5 బ్యాటరీ యూనిట్లున్నాయి. ఒక్కో బ్యాటరీ యూనిట్ ఖరీదు సుమారు రు. 3 వేల కోట్లుంటుంది. అలాంటి 5 యూనిట్లలో ప్రస్తుతానికి 5వ యూనిట్లోని 3, 4 బ్యాటరీల నిర్వహణను ప్రైవేటీకరించేందుకు రంగం సిద్ధమైపోయింది. 5వ యూనిట్ ను నిర్వహించేందుకు ఆహ్వానిస్తూ ప్రైవేటు సంస్ధల నుండి టెండర్లను ఆహ్వానించింది యాజమాన్యం.

ముందు 5వ యూనిట్ లోని 3,4 బ్యాటరీల నిర్వహణకు ప్రైవేటీకరణతో వ్యవహారం మొదలుపెట్టినా తొందరలోనే 1,2 బ్యాటరీల నిర్వహణకు టెండర్లు ఆహ్వానించేందుకు ఫైల్ రెడీ అవుతోంది. ప్రస్తుతం 5 యూనిట్లలోని బ్యాటరీల నిర్వహణను ప్లాంట్ ఉద్యోగులే బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. సంవత్సరాల తరబడి ఉద్యోగుల నిర్వహణలో ఉన్నప్పటికీ ప్లాంటుకు ఎలాంటి సమస్యా తలెత్తలేదు. అయినా సరే ప్లాంటుకు ఎంతో కీలకమైన కోక్ ఓవెన్ బ్యాటరీల ప్రైవేటీకరణతోనే స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటకీరణకు యాజమాన్యం శ్రీకారం చుట్టినట్లయ్యింది.

కోక్ ఓవెన్ విభాగాన్ని ప్రైవేటీకరించటంలో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఇందులో పనిచేస్తున్న 200 మంది ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీ చేయటానికి ఫైలు కూడా రెడీ అయిపోయింది. అంటే యాజమాన్యం వ్యవహారం చూస్తుంటే టెండర్లు దక్కించుకున్న ప్రైవేటు సంస్ధ తరపున 200 మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తారని అర్ధమవుతోంది. ఒక్కసారిగా 200 మంది ప్రైవేటు వ్యక్తులు ప్లాంటులోకి అడుగుపెట్టడమంటే మామూలు విషయం కాదు. ఇదే పద్దతిలో ప్రతి యూనిట్లోను తలా 200 మంది ప్రైవేటు వ్యక్తులు ఫ్యాక్టరీలోకి దిగేస్తారు.

ఈ పద్దతిలోనే ప్రతి విభాగం నిర్వహణను యాజమాన్యం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. జరుగుతున్న విషయాలను గమనిస్తున్న కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలకు పరిణామాలను అడ్డుకునేందుకు  ఏమి చేయాలో అర్ధం కావటంలేదు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే మొత్తం ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అయ్యేందుకు ఎంతోకాలం పట్టదని మాత్రం అర్ధమవుతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
Tags:    

Similar News