వసంత క్రిష్ణ ప్రసాద్ తో దేవినేని ఉమకు చెక్...కేశినేని ప్లాన్ అదుర్స్

Update: 2023-01-18 03:57 GMT
విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని ఇంతకాలం సైలెంట్ గా ఉన్నారు. ఆయన అలా ఉన్నారు అనుకుంటే పొరపాటే. తన దైన వ్యూహాలను రూపొందించుకున్నారు. ఇపుడు ఎన్నికలు దగ్గరపడేసరికి అవి బహిర్గతం అవుతున్నాయి. బెజవాడ రాజకీయాల్లో తన ప్రత్యర్ధులను అందరినీ పక్కన పెట్టడమో లేక వేరే చోట్లకు షిఫ్ట్ చేయడో అజెండాగా చేసుకుని కేశినేని పధకాలు రూపకల్పన చేస్తున్నారు.

అందులో భాగమే ఆయన మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుతోనే కధ మొదలెట్టారు. ఉమా అంటే నానికి అసలు పడదు, ఆయన పొడ గిట్టదు. దాంతో ఉమా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న మైలవరం అసెంబ్లీ సీటుని వైసీపీ ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ కి ఇప్పించాలని నాని చూస్తున్నారు అని అంటున్నారు. అలా కనుక చేస్తే వసంత క్రిష్ణ ప్రసాద్ తో చెలిమి సార్ధకం అవుతుంది. దేవినేని ఉమ శత్రుత్వానికి ఫలితం దక్కుతుంది అని లెక్కలు కడుతున్నారు.

అందుకే ఆయన ఇటీవల తరచూ వసంత క్రిష్ణ ప్రసాద్ ని పొగుడుతున్నారు ఎంపీ నిధులను ఆయన ఏరి కోరి వైసీపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఇవ్వడం కూడా తన వ్యూహంలో భాగమే అంటున్నారు. ఇక దేవినేనికి స్థాన చలనం కలిగిస్తే చాలు తన పధకం పారినట్లే అన్నది ఎంపీ గారి ఆలోచన. ఇదిలా ఉంటే ఈ మధ్యనే వసంత క్రిష్ణ ప్రసాద్ కూడా వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు.

తన స్వరాన్ని పెంచుకొస్తున్నారు. దానికి కారణం ఆయనకు తెలుగుదేశం నుంచి అభయం లభించింది అని అంటున్నారు. ఇక దేవినేని ఉమా 2019 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి వసంత క్రిష్ణ ప్రసాద్ చేతిలో ఓడారు. ఈసారి కూడా అక్కడ నుంచే పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే ఆయన్ని అధినాయకత్వం నూజివీడు వెళ్లాలని కోరుతోందిట.

నూజివీడు ఇపుడు వెళ్ళి దేవినేని అక్కడ గెలుపు పోరాటం చేయగలరా అంటే చూడాలి మరి. పైగా దేవినేని ఉమా  అనుచరవర్గం అంతా మైలవరంలోనే ఉంది. కొత్తగా వేరే సీటు అంటే గెలుపు పిలుపు వినిపిస్తుందా అన్న బెంగ ఆయనకు ఉంది అంటున్నారు. మరి తెలుగుదేశం అధినాయకత్వం కూడా వసంత క్రిష్ణ ప్రసాద్ కోసమే ఆ సీటుని ఖాళీ చేయించాలని చూస్తోంది అని అంటున్నారు. ఇక ఆ మధ్య దాకా వసంత క్రిష్ణ ప్రసాద్ మీద విరుచుకుని పడే దేవినేని ఉమా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.

దాని వెనక కారణాలు ఆయనకే తెలియాలి. అదే టైం లో వసంత క్రిష్ణ ప్రసాద్ కూడా దేవినేని ఉమాను ఏమీ అనడంలేదు. ఇవన్నీ ఇలా ఉంటే వసంత క్రిష్ణ ప్రసాద్ మంచి నాయకుడు మంచి మనిషి అని బెజవాడ ఎంపీ కేశినేని నాని సర్టిఫికేట్లు ఇస్తున్నారు. తాను ఎంపీ నిధులు ఇస్తే వాటిని పూర్తిగా సద్వినియోగం చేశారు అని కూడా పొగుడుతున్నారు. మొత్తానికి ఈ బంధం కాస్తా దేవినేని కి చెక్ పెట్టేలా ఉంది అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News