ప్రధానిగా రాహుల్ : ఆయన అమాయకత్వమే నచ్చేస్తోందా...?

Update: 2022-08-05 01:30 GMT
రాహుల్ గాంధీకి ఏ రకమైన రాజకీయ వ్యూహాలు తెలియవు. ఆ మాట అనేందుకు పెద్దగా రాజకీయ విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు. ఆయన ముక్కుసూటిగా ఉంటారు. అలాగే మాట్లాడుతారు. ఇంకా గట్టిగా చెప్పుకోవాలీ అంటే ఆయన తల్లి సోనియాగాంధీకి తెలిసిన రాజకీయం కానీ వ్యూహాలు కానీ రాహుల్ భాయ్ కి తెలియవు. ఆయనదంతా అదో టైప్. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేయడం. కుండబద్ధలు కొట్టడం. నేను ఇలాగే ఉంటాను నాలాగే ఉంటాను అని చెప్పేసుకుని ఒప్పేసుకోవడం.

నిజానికి ఈ విషయంలో రాహుల్ గాంధీని రాజీవ్ తో పోల్చాలి. రాజీవ్ కి కూడా ఏ రకమైన రాజకీయ వ్యూహాలు కానీ చతురత కానీ లేదు. ఆయన సడెన్ గా తన అమ్మ వారసత్వంగా ప్రధాని పదవిని అందుకున్నారు. అయిదేళ్ల పాటు పాలించారు. అయితే ఆయనకు వ్యూహాలు తెలియకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ 1989లో ఓడింది. అదే కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ఆయన 1991 ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకుని తిరిగారు.

ఆయన శ్రమ ఫలించేదేమో కానీ మధ్యలో ఆయన దారుణహత్యకు గురి అయి ఈ లోకాన్ని వీడారు. ఇక రాహుల్ ని చూస్తే ఆయనకు వ్యూహాలు తెలియవు అనే చెప్పాలి. 2004 నుంచి ఎంపీగా గెలుస్తున్నారు. ఆయనకు మంచి యూత్ ఫాలోయింగ్ ఉంది. వెనకాల అద్భుతమైన పార్టీ ఉంది. నడిపించే సైన్యంలా క్యాడర్ ఉంది. అయినా కానీ రాహుల్ తాను ఎలా ఉండాలో అలాగే ఉంటున్నారు. ఆయన మోడీ సర్కార్ మీద  ఫైట్ చేస్తారు కానీ అందులో నాటకీయత ఉండదు. ఆయన బీజేపీ మీద  విమర్శలు చేస్తారు కానీ అందులో ఫైర్ కనబడదు, వాస్తవమే ఉంటుంది.

ఆయన పబ్లిక్ లోకి వచ్చి స్పీచెస్ ఇస్తారు కానీ దానిలో కూడా మజా మత్తు కంటే వాస్తవాలు ఉంటాయి. అయితే ఈ దేశంలో మాత్రం రాజకీయం ట్రెండ్ మార్చేసుకుంది. ఉన్నది ఉన్నట్లుగా చెబితే నడిచే కాలం కాదిది. నాటకీయత అవసరం. అలాగే మాటలతో మండించాలి. కంటి చూపుతో శాసించాలి. కానీ ఈ గాంధీ నెహ్రూ అయిదవ తరం వారసుడికి అవి వంటబట్టలేదు. ఆయన కూడా నేర్చుకోవాలన్న ఆసక్తి చూపించలేదు.

ఆయన కనుక అలా అనుకుంటే ఇట్లాంటి ఎత్తుగడలతో సీనియర్లు వెనకాలే క్యూ కడతారు. కానీ ఆయన సీనియర్లు వద్దు అంటున్నారు. యూత్ అంటున్నారు. జనాలకు మనమేంటో ఎలా ఉన్నామో అలా తెల్ల చొక్కా మాదిరిగా కనిపించాలనుకుంటున్నారు. ఈ రోజున కాంగ్రెస్ ఈ విధంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది అంటే దానికి రాహుల్ నైజం కారణం అనే చెప్పాలి. ఆయన నైజం పూర్తిగా నాటి కాంగ్రెస్ నాయకులకు భిన్నం. తన నాన్నమ్మ, ముత్తాత, తండ్రులకు పూర్తిగా భిన్నం.

రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలన్న మౌలిక సూత్రాన్ని రాహుల్ నమ్మరు. మనం ప్రజా కోణంలో చూడాలి, వారి గొంతుకగా మాట్లాడాలి అన్నది ఆయన భావన. తాను చాలా సింపుల్ గా ఉంటారు. అలాగే ఉండాలనుకుంటారు. ఆర్భాటాలు, అనవసరమైన ప్రసంగాలు, బాడీ లాంగ్వేజ్ చీటికీమాటికీ మార్చేయడాలు ఆయనకు గిట్టని విషయాలు.

అదే టైమ్ లో ఆయన దేనికీ భయపడడంలేదు. అమిత్ షా మోడీ తనను ఎంత భయపెట్టాలని చూసినా ఎదుర్కొంటాను, డేరింగ్ గా స్టెప్ వేస్తాను తప్ప బెదిరిపోను అని రాహుల్ చెబుతున్నారు. బహుశా ఈ ధైర్యం యూత్ కి నచ్చవచ్చు. ఆయన ఒక సగటు మనిషిలాగానే ఆలోచిస్తున్నారు. కానీ ముల్లుని ముల్లుతో తీయాలనుకోవడంలేదు. అందుకే రాహుల్ కాంగ్రెస్ కి భిన్నమైన మనిషిగా ఉన్నారు.

అయితే కాలం ఎపుడూ ఒకేలా ఉండిపోదు. అది మారుతూ వస్తుంది. కర్నాటక టూర్ లో ఒక స్వామీజీ రాహుల్ ప్రధాని అవుతారు అని చెప్పారు. అది ఇప్పటికిపుడు జరగకపోయినా ఏదో రోజున జరుగుతుందేమో. రాహుల్ ఆలోచనలకు తగినట్లుగా జనాలు కూడా టర్న్ అయిన రోజున ఆయన ఈ దేశానికి ప్రధాని అయి తీరుతారు. ఆయనలోని ఏమీ తెలియని తత్వమే జనాలకు బాగా నచ్చేసే రోజున ఉన్నత స్థానం ఆయన వశం అవుతుంది.

ఆయన రాజకీయ అమాయకత్వమే ఏదో రోజున శిఖరానికి చేరుస్తుందేమో. అయితే ఒక్క మాట ఇక్కడ చెప్పుకోవాలి. దాదాపుగా రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో రాహుల్ మొదటి నుంచి తాను ఎలా ఉండాలో అలాగే ఉంటున్నారు. కాంగ్రెస్ వారసత్వ జాఢ్యం కానీ వర్తమాన రాజకీయాల వింత విపరీత పోకడలను కానీ ఏనాడూ ఆయన  ఆశ్రయించలేదు. అదే ఆయనకు ఏదో రోజున మేలు చేసేదిగా ఉండొచ్చేమో.
Tags:    

Similar News