అద‌ర‌గొట్టే రేటు ప‌లికిన నిజాం డైమండ్ న‌క్లెస్‌!

Update: 2019-06-20 10:46 GMT
భార‌త రాజ‌వంశీకుల‌కు చెందిన 400 విలువైన ఆభ‌ర‌ణాల్ని తాజాగా వేలం వేశారు. మ‌హారాజాస్ అండ్ మొఘ‌ల్ మాగ్నిఫికెన్స్ పేరుతో సాగిన ఈ వేలాన్ని క్రిస్టీ సంస్థ వేలానికి పెట్టింది. వ‌జ్రాభ‌ర‌ణాలు.. ముత్యాల న‌క్లెస్ లు.. క‌త్తులు.. ఉంగ‌రాలు ఇలా ప‌లు వ‌స్తువుల్ని ఈ సంస్థ తాజాగా వేలం వేసింది. నిర్వాహ‌ఖుల అంచ‌నాల‌కు భిన్నంగా భారీ మొత్తంలో ఈ న‌గ‌లు ధ‌ర‌లు ప‌లికాయి. హైద‌రాబాద్ ను పాలించిన నిజాం న‌వాబులు ధ‌రించిన ఆభ‌ర‌ణాల‌కు ఊహించిన దాని కంటే భారీ ధ‌ర పలికిన‌ట్లుగా చెప్పాలి.

నిజాం న‌వాబుల‌కు చెందిన రివ‌రీ డైమండ్ న‌క్లెస్ వేలంలో 24,15, 000 డాల‌ర్ల ధ‌ర ప‌లికింది. మ‌న రూపాయిల్లో చెప్పాలంటే ఈ న‌గ రూ.10.5 కోట్లు ప‌లుకుతుంద‌ని భావిస్తే.. అది కాస్తా ఏకంగా రూ.17 కోట్లు ప‌ల‌క‌టం విశేషం. ఈ న‌గ‌లో 33 వ‌జ్రాలు ఉన్నాయి. ఆర్క‌ట్ న‌వాబుల‌కు చెందిన 17 క్యారెట్ల గోల్కొండ వ‌జ్రం అర్క‌ట్ 2 రికార్డు స్థాయిలో ధ‌ర ప‌లికిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ న‌గ‌కు ఏకంగా రూ.23.5 కోట్లు ప‌లికింద‌ని క్రిస్టీ సంస్థ పేర్కొంది.

ఇక‌.. నిజాం నాటి క‌త్తి రూ.13 కోట్లు ప‌లుక‌గా.. జైపూర్ రాజ‌మాత ధ‌రించిన వ‌జ్ర‌పు ఉంగ‌రం రూ.4.45కోట్లు ప‌లికింది. స‌హ‌జ ముత్యాల‌తో త‌యారు చేసిన ఐదు వ‌రుస‌ల న‌క్లెస్ రూ.11.8 కోట్లు ప‌లికింది. మొత్తంగా 400 న‌గ‌ల‌ను వేలం వేయ‌గా.. రికార్డు స్థాయిలో రూ.760.16 కోట్ల మొత్తం రావ‌టం గ‌మ‌నార్హం. భార‌తీయ రాజ‌రిక వంశీకుల న‌గ‌ల‌కు అంత‌ర్జాతీయంగా ఎంత డిమాండ్ ఉందో తాజా వేలం నిరూపించిన‌ట్లైంది.
Tags:    

Similar News