వ్యాక్సిన్ తీసుకోనోళ్లకు టీటీడీ షాక్

Update: 2021-07-02 12:01 GMT
కరోనా కల్లోలం ఇంతలా సాగుతున్నా కొందరు ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోకుండా ఏవేవో అపోహలు పెట్టుకొని దూరంగా ఉంటున్నారు. టీకా తీసుకుంటే శృంగార సామర్థ్యం తగ్గుతుందని కొందరు.. టీకాలతో సైడ్ ఎఫెక్ట్ లు వస్తాయని కొందరు ఇప్పటికీ తీసుకోవడం లేదు.

ఓవైపు కరోనా వైరస్ తో ప్రాణాలు పోతున్నా సరే కొందరు జనాల్లో మార్పురావడం లేదు. చాలా మంది టీకాల కోసం ఎగబడుతున్నా.. అంతే స్థాయిలో తీసుకోవడానికి వెనుకాడతున్న వారు ఉన్నారు.

ఇక రోజుకు దేశ విదేశాల నుంచి లక్షల మంది భక్తులు వచ్చే టీటీడీలో కరోనా వైరస్ ఎంత తీవ్రమో అర్థం చేసుకోవచ్చు. ఎవ్వరూ తీసుకున్నా తీసుకోకపోయినా టీటీడీ ఉద్యోగులు ఈ టీకా తీసుకోవాలి. కానీ వారిలో నిర్లక్ష్యం బాగా పెరిగిపోయిందని.. చాలా మంది తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తిరుమల తిరుపతి దేవస్థానంలోని చాలా మంది ఉద్యోగులు టీకాలు తీసుకోలేదట.. తీసుకోవాలని చెప్పినా పెడచెవిన పెట్టారట.. వారందరికీ తాజాగా గట్టి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది టీటీడీ.

కరోనా టీకా తీసుకున్న ఉద్యోగులకు మాత్రమే జూన్ నెల జీతం ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. వ్యాక్సిన్ తీసుకోవడానికి ఈనెల 7వ తేదీ గడువు ఇచ్చింది. ఈ సమయంలోగా సమయం ఇస్తామని.. అప్పటివరకు వ్యాక్సిన్ వేసుకోకుంటే 45 ఏళ్లు పైబడిన వారికి జీతాలు ఆపేస్తామని టీటీడీ సంచలన ప్రకటన చేసింది.

టీటీడీ తాజా నిర్ణయంతో వ్యాక్సిన్ల కోసం ఉద్యోగులు టీకా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఇన్నాళ్లు నిర్లక్ష్యంచేసిన వారికి ఇప్పుడు గట్టి బుద్దిచెప్పేలా టీటీడీ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఇక ఇంత ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకుంటారా? అని పలువురు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కిందా మీదా పడుతూ వ్యాక్సిన్ల కోసం పరుగులు పెడుతున్నారు.
Tags:    

Similar News