పవన్ తో వంగవీటి చెట్టాపట్టాల్

Update: 2022-09-16 08:24 GMT
విజయవాడలో ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వంగవీటి రాధాక్రిష్ణ వచ్చే ఎన్నికల కోసం భారీ స్కెచ్ వేశారు. తాను ఎంతో ఇష్టపడే విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయడానికి ఆయన ఒక కరెక్ట్ రూట్ ని ఎంచుకున్నారు అని చెబుతున్నారు. ఆయన సాధ్యమైనంత త్వరలో జనసేనలో చేరిపోవడం ఖాయం అన్న ప్రచారం ఇపుడు ఊపందుకుంది.

ఆ మధ్యన జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ ఏకంగా వంగవీటి రాధా ఇంటికి వెళ్ళి మరీ ఏకాంత చర్చలు జరిపారు. ఈ చర్చలకు అంత రాజకీయ ప్రాధాన్యత లేదని అప్పట్లో రాధా నాదెండ్ల ఇద్దరూ చెప్పినా నాటి మాటలే నేడు ఆచరణకు కారణం అవుతున్నాయని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే  తొందర్లోనే  వంగవీటి రాధా జనసేన కండువా కప్పుకుంటారు అని తెలుస్తోంది.

అదే టైం లో ఆయన విజయవాడకు పవన్ వచ్చినపుడు జరిగే బహిరంగ సభలో చేరుతారు అని కూడా అంటున్నారు. ఇంతకీ రాధా టీడీపీలో ఉన్న నాయకుడు కదా. ఆ పార్టీ నుంచి జనసేనలోకి ఎందుకు వెళ్తున్నారు అంటే దానికి ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయట. విజయవాడ సెంట్రల్ సీటు మీద కర్చీఫ్ కాదు మొత్తం పరచేసి బోండా ఉమ ఉన్నారు. ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. పైగా ఆయన ఆ సీటు నుంచి 2014 ఎన్నికల్లో గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో జస్ట్ పాతిక ఓట్ల తేడాతో ఓడిపోయారు.

దాంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకే ఆ సీటు కంఫర్మ్ అని టీడీపీలో వినిపిస్తున్న మాట. ఇక రాధ ఎన్ని పార్టీలు మారుతున్నా ఆయన కోరుకున్నది సెంట్రల్ సీటే. 2019 ఎన్నికల్లో కూడా జగన్ ఆయనకు తూర్పు సీటు ఇస్తామని చెప్పారు. మచిలీపట్నం ఎంపీ టికెట్ అని కూడా అన్నారు. కానీ విజయవాడ సెంట్రల్ మీదనే రాధా పట్టుబట్టి మరీ వైసీపీ నుంచి వెళ్లిపోయారు. అయితే ఆయన తరువాత టీడీపీలో చేరినా ఆ సీటు దక్కలేదు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ సీటు ఇస్తామని రాధాకు చెప్పి ఆ పార్టీ తరఫున ప్రచారం చేయించుకున్నారు

కానీ టీడీపీ పవర్ లోకి రాలేదు, వైసీపీ గెలిచింది. రాధా ఎటూ కాకుండా పోయారు. దాంతో ఆయన ఇపుడు మరోసారి తీవ్రంగా ఆలోచించి మరీ ఒక కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. ఈసారి కూడా ఆయన ఉంటున్న టీడీపీలో టికెట్ దక్కదని తేలుతున్న నేపధ్యంలో జనసేన వైపు చూస్తున్నారు. ఇక వైసీపీలో రాధా చేరుతారు అని వినిపించినా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. ఆయన్ని కాదని జగన్ కూడా టికెట్ ఇవ్వరని అంటున్నారు.

అయితే సామాజికసమీకరణలు పొత్తులు వంటివి కనుక తీవ్ర ప్రభావం చూపిస్తే జగన్ డెసిషన్ మారే అవకాశం ఉంది అంటున్నారు. ఇక కొడాలి నాని, వల్లభనేని వంశీకు రాధా ఫ్రెండ్ కాబట్టి ఆ విధంగా వైసీపీలోకి ఆయన్ని తీసుకురావాలన్న ప్రయత్నాలు అయితే జరిగాయి. కానీ ఎందుకో ఇపుడు రాధా మనసు మార్చుకుని జనసేన వైపు వెళ్తున్నారు. ఆయనకు జనసేనతో మంచి సంబంధాలే ఉన్నాయి.

అప్పట్లో అంటే 2009 ఎన్నికల్లో రాధా ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆ పార్టీలో కీలకంగా ఉన్న పవన్ తో ఆయనకు మంచి రిలేషన్స్ అలాగే కొనసాగుతూ వచ్చాయి. ఇపుడు పవన్ జనసేన పార్టీ పెట్టారు, పైగా కోరి మరీ పిలుస్తున్నారు కాబట్టి రాధా ఆ వైపునకు చూడవచ్చు అని అంటున్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఉంది. జనసేన టీడీపీలో మధ్య పొత్తులు కనుక ఉంటే అపుడు రాధా ఏం చేస్తారు అన్నదే ప్రశ్న.

అపుడు కచ్చితంగా సెంట్రల్ సీటు బోండా ఉమాకే వెళ్తుంది. మరి తాను ఎంతో కోరుకున్న సీటు మళ్లీ మళ్లీ పార్టీలు మారినా దక్కదా అంటే రాధా ఏం చేస్తారో చూడాలి. లేదా రాధా కోసం పవన్ పట్టుబట్టి మరీ ఆ సీటుని బాబు నుంచి తీసుకుంటారా అన్నదే చర్చ. ఏది ఏమైనా రాధా కనుక జనసేనలో చేరితో కోస్తాతో పాటు గోదావరి జిల్లాలలో బలమైన  ఉన్న ఒక సామాజికవర్గంలో ఊపు వస్తుంది. అది జనసేనకు ప్లస్ అవుతుంది అనడంలో సందేహం లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News