బాబుకు షాక్ : టీడీపీ ఎమ్మెల్సీ వాకౌట్‌

Update: 2017-03-30 07:27 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌, శాస‌న‌మండ‌లి సాగుతున్న తీరుపై ఇన్నాళ్లు ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేయ‌గా ఇప్పుడు ఆ జాబితాలో అధికార పార్టీ ఎమ్మెల్సీ చేరారు. మండ‌లి నిర్వ‌హ‌ణ తీరు సరిగా లేద‌ని, కీల‌క అంశాల‌పై మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. శాసనమండలిలో జడ్పీటీసీ - ఎంపిటీసీ సభ్యుల సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల టీడీపీ ఎమ్మెల్సీ యలమంచిలి రాజేంద్రప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. క్షేత్ర‌స్థాయిలోని స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించేందుకు మైక్ ఇవ్వ‌క‌పోతే ఎలా అంటూ అస‌హనం వ్య‌క్తం చేశారు. ఏకంగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

రాష్ట్ర శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడేందుకు సమయం కేటాయించాలని టీడీపీ ఎమ్మెల్సీ యలమంచిలి రాజేంద్రప్రసాద్  కోరారు. అయితే అందుకు మండలి చైర్మన్ చక్రపాణి నిరాకరించడంతో అసహనానికి గురై స్థానిక సంస్థల నుంచి 30 మంది ఎమ్మెల్సీలు మండలికి ఎన్నికయ్యామని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రస్తావించేందుకు సమయం ఇవ్వకపోతే ఎలా అంటూ రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు ఎక్కువగా అవకాశం ఇస్తున్నారన్నారు. దీనిపై మండలి చైర్మన్ వివరణ ఇస్తూ, ప్రశ్నోత్తరాల సమయం 11 గంటలు దాటిన తరువాత ప్రశ్నలో ముద్రించిన పేర్లు ఉన్న వారికే అవకాశం ఇస్తున్నామని గుర్తు చేశారు. అయినప్పటికీ, స్థానిక సంస్థల అంశంపై చర్చకు అవకాశం ఇవ్వాలని రాజేంద్రప్రసాద్ పట్టుబట్టారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు అంటే చులకన అని, చిన్న చూపుఅంటూ విమర్శించారు. ఇది సర్పంచ్‌లు, ఎంపిటీసీ, జడ్పీటీసీ సభ్యులకు సంబంధించిన అంశమన్నారు. టీచర్ ఎమ్మెల్సీలు అంటే అంత భయమెందుకని, స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీల‌మైన తాము మండలిలో మూడోవంతు ఉన్నామని గుర్తు చేశారు. చైర్మన్ చక్రపాణి స్పందిస్తూ, 11 గంటలు దాటక ఎక్కువ మందికి ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడించకూడదన్న నిర్ణయం వల్ల ఎమ్మెల్సీ రామ్మోహన్‌ కు కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. తాను వాకౌట్ చేస్తున్నట్లు రాజేంద్రప్రసాద్ ప్రకటించగా, సహచర ఎమ్మెల్సీలు ఆయనకి సర్దిచెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News