షాక్ : ఇక ఇన్‌ క‌మింగ్ కి బిల్లు క‌ట్టాల్సిందే

Update: 2018-11-25 08:01 GMT
రెండు, మూడేళ్ల కింద‌టి వ‌ర‌కు భారీ రీచార్జ్ ప్లాన్‌ల‌ తో వినియోగ‌దారుల న‌డ్డివిరిచిన ప‌లు సెల్‌ఫోన్ సేవ‌ల సంస్థ‌లు....రిల‌య‌న్స్ జియో సేవ‌ల రాక‌తో త‌మ ప్రణాళిక‌ల‌ను మార్చుకున్న సంగ‌తి తెలిసిందే. గ‌తం కంటే త‌క్కువ టారిఫ్‌లు, అందుబాటులో ఉండే ప్లాన్‌ల‌ను అందించాయి. అయితే, తాజాగా మ‌రోమారు వినియోగ‌దారుల న‌డ్డి విరిచేందుకు సిద్ధ‌మ‌య్యాయి. మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు షాకిచ్చేలా దిగ్గజ టెలికాం సంస్థలు సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుడుతున్నాయి. లైఫ్‌టైం ఫ్రీ ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ప్లాన్‌లను రద్దుచేయాలని ఎయిర్‌టెల్‌ - వొడాఫోన్‌- ఐడియా సంస్థలు నిర్ణయించినట్టుగా సమాచారం. టెలికాం సంస్థలు తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో భవిష్యత్తులో ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు సైతం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితులు రానున్నాయి. అయితే, ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు సంబంధించి నిమిషాల చొప్పున ఛార్జీలు వడ్డించకుండా కనీస రీఛార్జిలను చేసుకున్న వారికి నిర్ణీత కాలానికి ఫ్రీ ఇన్‌కమింగ్‌ కాల్స్‌ సదుపాయాన్ని అందించాలని ఈ దిగ్గజ కంపెనీల నిర్ణయించినట్టుగా సమాచారం. జియో పోటీతో నష్టాలను తట్టుకొని నిలబడేందుకు గాను ప్రస్తుత టారిఫ్‌లలో మార్పులకు యోచిస్తున్నట్టు సమాచారం.

స‌హ‌జంగా, ఔట్‌ గోయింగ్‌ కాల్స్‌ వెళ్లా లంటే కూడా మినిమమ్‌ రీచార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ప్యాక్‌ వ్యాలిడిటీ రెండు రోజుల్లో ముగుస్తుంది దయ చేసి రీచార్జ్‌ చేసుకోండి, లేదంటే మీ ఔట్‌ గోయింగ్‌ సర్వీసులు నిలిపివేయబడతాయి అనే మేసేజ్‌లో చూసి ఉంటాం. కానీ కొత్తగా ఇన్‌కం కాలింగ్స్‌కు కూడా తప్పనిసరిగా రీచార్జ్‌ చేసు కోవాల్సిందే అంటున్నాయి కొన్ని కంపెనీలు. లేదంటే మీ ఇన్‌ కమింగ్‌ సర్వీసులు కూడా నిలిపివేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇన్‌కమింగ్‌ కాల్స్‌ రావాలంటే కూడా రీచార్జ్‌ చేసుకోవాల్సిన కొత్త నిబంధన తీసుకురావడానికి ఎయిర్‌టెల్‌ - వొడాఫోన్‌ - ఐడియా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. తమ నెంబర్‌ మనుగడలో ఉంచుకోవాలంటే మినిమమ్‌ అమౌంట్‌తో లైఫ్‌టైం ఫ్రీ ఇన్‌ కమింగ్‌ ప్లాన్‌ రీచార్జ్‌ చేసుకోవాల్సిందే అంటున్నాయి మూడు టెలికాం ఆపరేటర్లు.

రిలయన్స్‌ జియో వచ్చి టెలికం మార్కెట్‌ రంగాన్ని ఊపేసింది. అతి తక్కువ టారీఫ్‌లతో అత్యధిక డేటా, కాల్స్‌ ప్యాకేజీలను అందజేస్తూ కోట్లాది వినియోగదారులను తనవైపు తిప్పుకోవడంతో మిగిలిన కంపెనీలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆదాయం సమకూర్చుకొవాలంటే తప్పనిసరిగా కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సిందే అంటున్నాయి. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా కస్టమర్లు ఇక జీవిత కాల ఉచిత ఇన్‌కమింగ్‌ కాల్స్‌ పొందలేరు. అలా పొందాలంటే మినిమం రీచార్జ్‌ చేసుకోవాల్సిందే. అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుండటంతో వినియోగదారులు షాక్‌కు గురవు తున్నారు. ఔట్‌ గోయింగ్‌ కాల్స్‌కు నిమిషానికి డబ్బులు కట్‌ అవుతూ ఉంటాయి. ఇన్‌కమింగ్‌ కోసం చేసే రీచార్జ్‌లో నిమిషాల నిబంధన ఉండదు. ఇన్ని రోజులకు ఇంతతో రీచార్జ్‌ చేసుకోవాలనే రూల్‌ను విధించనున్నాయి.

ఇదిలాఉండ‌గా, ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు సంబంధించిన రీచార్జ్‌లను ఎయిర్‌టెల్‌ కొన్ని ప్లాన్‌లను కూడా విడుదల చేసింది. ముందుగా మూడు రీచార్జ్‌ ప్లాన్‌లను తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రూ.35, రూ.65, రూ.95ను పరిచయం చేసింది. ఈ ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకుంటే మొబైల్‌ డేటా, టారీఫ్‌ కట్టర్‌, టాక్‌టైం సేవలు కూడా అందిస్తుంది. మూడు ప్లాన్‌లకు కేవలం 28 రోజుల వ్యాలిడిటీ మాత్రమే విధించడంతో కస్టమర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇన్‌కమింగ్‌ కాల్స్‌ రావాలంటే కచ్చితంగా నెలకు కనీసం రూ.35 రీచార్జ్‌ చేసుకోవాల్సిందే.
Tags:    

Similar News