ముందే వస్తున్న ధనాధన్ క్రికెట్ పండుగ.. ఎందుకంటే?
ఇప్పటికే 17 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఐపీఎల్ దాదాపు నెల రోజుల్లో మళ్లీ మన్నల్ని పలకరించనుంది.
ప్రపంచ క్రికెట్ లీగ్ లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రేంజే వేరు. కోట్లకు కోట్లు డబ్బు.. అంతమించిన ప్రచారం.. పైకి తిరిగి తమ తమ జాతీయ జట్లకు ఎంపికయ్యేందుకు ఆటగాళ్లకు సరైన వేదిక. అందుకనే ఈ లీగ్ కు అంత పేరు ప్రఖ్యాతులు.
ఇప్పటికే 17 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఐపీఎల్ దాదాపు నెల రోజుల్లో మళ్లీ మన్నల్ని పలకరించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గత ఏడాది నవంబరు నెలలోనే మెగా వేలం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ అత్యధికంగా రూ.27 కోట్ల ధర పలికాడు.
ఈసారి ఐపీఎల్ సంబరం ఎప్పటిలాగే మార్చిలోనే మొదలుకానుంది. కాగా, కొత్త సీజన్ స్టార్ట్ కు ముందు వన్డే ఫార్మాట్ లో కీలకమైన చాంపియన్స్ ట్రోఫీ ఆడాల్సి ఉంటోంది. ఇది ముగిసిన రెండు వారాల్లోనే ఐపీఎల్ మొదలుకానుంది. అంటే.. దాదాపు వచ్చే మూడు నెలలు క్రికెట్ అభిమానులకు పండుగే.
మెగా టీ20 లీగ్ కు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. కొత్త సీజన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులను సంతోషపెట్టేందుకు రంగం సిద్ధమైంది.
ఇప్పటివరకు మార్చి 23 నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుందనే వార్తలు వచ్చాయి. తాజా అప్ డేట్ ప్రకారం మార్చి 22న అంటే ఒకరోజు ముందుగానే 18వ ఎడిషన్ ప్రారంభం కానుంది.
తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (KKR vs RCB) జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. గత సీజన్ ఫైనలిస్టులు సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ను సొంత మైదానం ఉప్పల్ లోనే ఆడనుంది. మార్చి 23న రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది.
ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్ మే 25న జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ ఊహాగానాలే. ఐపీఎల్ వర్గాల నుంచి ప్రకటన రాలేదు. వచ్చే సీజన్ లో 12 మైదానాల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. అవి.. అహ్మదాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, లక్నో, ముల్లాన్‌పుర్, ఢిల్లీ, జైపూర్, కోల్ కతా, హైదరాబాద్, గువాహటి, ధర్మశాల రాజస్థాన్ కు గువాహటి రెండో హోం గ్రౌండ్‌గా.. పంజాబ్ కింగ్స్ కు ధర్మశాల రెండో సొంత మైదానం